: ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ లో ధోనీయే అత్యుత్తమ కీపర్: ఎమ్మెస్కే
ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీయేనని టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. టీమిండియా ఎంపికలో గంభీర్, రైనా, ఊతప్ప వంటి వారిని పక్కన పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధోనీ ఫాంపై తమకు ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ కీపర్ ఎవరంటే, ఎవరైనా సరే చెప్పే పేరు 'ధోనీయే'నని ఆయన చెప్పారు. ప్రస్తుతం అతని బ్యాటింగ్ ఫాం గురించి అంతా ఆందోళన చెందుతున్నారని, అయితే టీమిండియాకు ధోనీ వెలకట్టలేని ఆస్తి అని ఆయన చెప్పారు.
ధోనీ సలహాలు, సూచనలు, ఆట జట్టుకు ఎంతో ఉపయోగమని ఆయన చెప్పారు. ధోనీ వ్యూహాలు విరాట్ కు మార్గనిర్దేశం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ధోనీ తన 10-12 ఏళ్ల కీపింగ్ కెరీర్ లో ఒక్క పొరపాటు చేసినట్లు కూడా కనిపించడని ఆయన అన్నారు. ఇక ఇతర ఆటగాళ్లంతా ఎవరి పాత్రను వారు పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఉన్న వనరుల్లో అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని ఆయన చెప్పారు. టీ20 ఫార్మాట్ వేరు, 50 ఓవర్ల ఫార్మాట్ వేరన్న సంగతి అంతా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.