: మొదలైన ట్రంప్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో 4వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పేందుకు సిద్ధమైన కాగ్నిజెంట్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ మొదలైంది. హెచ్1-బీ వీసాలపై అమెరికా విధించిన ఆంక్షల సెగ భారతీయులకు ఇప్పుడిప్పుడే తగులుతోంది. ట్రంప్ దెబ్బతో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. ఉద్యోగుల తీసివేతలో ఇన్ఫోసిస్ ఇప్పటికే బిజీగా ఉండగా, కాగ్నిజెంట్ కూడా దానిని అనుసరిస్తోంది. దేశ వ్యాప్తంగా 30 వేల మందిని, ఒక్క హైదరాబాద్ నుంచే 4వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. విప్రో, టెక్ మహీంద్రాలు కూడా అదే పనిలో ఉన్నట్టు సమాచారం. తమకు పనికిరారనుకున్న ఉద్యోగులను కంపెనీలు ఏటా ఒక శాతం తొలగిస్తుండడం సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ ఇలా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పాలనుకోవడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
వచ్చే రెండేళ్లలో 10 వేల మంది అమెరికన్లను నియమించుకోనున్నట్టు ఇన్ఫోసిస్ గత నెలలోనే ప్రకటించింది. 600 మంది ఉద్యోగులను తొలగించిన విప్రో అమెరికన్ ఉద్యోగుల నియామకానికి సిద్ధమైంది. ఇప్పుడు కాగ్నిజెంట్ ఏకంగా దేశవ్యాప్తంగా 30 వేల మందిని ఇంటికి పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఆ సంస్థ ఆదాయంలో 75 శాతానికి పైగా అమెరికా నుంచి వస్తున్నదే. నిన్నమొన్నటి వరకు హెచ్-1బీ వీసాలపై భారతీయులతో పనిచేయించుకున్న కాగ్నిజెంట్ ఇప్పుడు హెచ్-1బీ వీసాలపై ఆధారపడడాన్ని తగ్గించుకుని స్థానికుల నియామకానికి నడుం బిగించింది.
అందులో భాగంగా సంస్థలో వివిధ హోదాల్లో ఉన్న వారిని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరింది. అలా చేసిన వారికి 9 నెలల జీతం ఇస్తామని పేర్కొంది. చిన్న ఉద్యోగులకైతే 5 నెలల జీతం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కాగ్నిజెంట్‌లానే అక్కడి మిగతా కంపెనీలు కూడా స్థానికుల నియామకానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. పలు రంగాలపైనా దాని ప్రభావం పడుతుందని, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.