: నంద్యాల అభ్యర్థి ఎవరైనా వారి గెలుపు కోసం కృషి చేస్తా: శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాల స్థానాన్ని ఎవరికి కేటాయించినా వారి గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఏపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శిల్పాతో శాసన మండలి చైర్మన్ చక్రపాణి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, శిల్పా మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఆశయాలకు అనుగుణంగా తాము పనిచేస్తామని, తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి ఏ అభ్యర్థిని ఎంపిక చేయాలనే విషయమై తాను కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించానని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం నిర్ణయమే తనకు శిరోధార్యమని, నంద్యాలలో గెలిచే అభ్యర్థి ఎవరనే దానిపై సర్వేలు చేయిస్తున్నారని అన్నారు. కాగా, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.