: భారత్ ను హిందూ దేశంగా మార్చాలంటే ఈయనను రాష్ట్రపతి చేయండి: ఉద్ధవ్ థాకరే
సెక్యులర్ దేశమైన భారత్ ను హిందూ దేశంగా మార్చాలనుకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను తదుపరి రాష్ట్రపతిగా చేయాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సూచించారు. హిందూ రాజ్య స్థాపనే తమ ప్రథమ లక్ష్యమని ఆయన అన్నారు. తొలిసారిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చిందని... ఈ నేపథ్యంలో భగవత్ ను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలపాలని చెప్పారు.
తమ పార్టీ అధికార పత్రిక సామ్నాలోని కథనంలో... హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా మోహన్ భగవత్ ను రాష్ట్రపతిని చేయాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ పేర్కొన్నారు. భగవత్ లాంటి ఓ బలమైన నేత రాష్ట్రపతిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, తనకు రాష్ట్రపతి పదవిపై ఆసక్తి లేదని భగవత్ ఇప్పటికే చెప్పడం గమనార్హం.