: లాలూకు ఎదురు దెబ్బ... ప్రతి కేసులో విచారణ తప్పదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు


1990 దశకంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 900 కోట్ల పశువుల దాణా కుంభకోణం కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసుల్లో విడివిడిగా లాలూ విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. లాలూపై సీబీఐ దాఖలు చేసిన అభియోగాలను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేయడాన్ని తప్పుబడుతూ, తాజా విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రెజరీ కార్యాలయం నుంచి చట్ట వ్యతిరేకంగా నిధులను విడుదల చేసిన కేసులో హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ పునర్విచారణకు అనుమతులను కోరుతూ సీబీఐ పిటీషన్ వేయగా, నేడు జస్టిస్‌ అమితావ్‌ రాయ్‌, జస్టిస్‌ పీసీ ఘోష్‌ లు విచారణ చేపట్టారు.

ఈ సందర్భంగా కేసులో సీబీఐ వైఖరిని కూడా అత్యున్నత ధర్మాసనం తప్పుబట్టింది. లాలూపై విచారణ విషయంలో సీబీఐ ఇప్పటికే ఎంతో ఆలస్యం చేసిందని, దీంతో సీబీఐకి ఉన్న మంచి పేరు కూడా పోయిందని వ్యాఖ్యానించింది. ఈ కేసును ప్రాధాన్యమైనదిగా భావించి, ఆరు నెలల్లోగా కేసులన్నింటిలోనూ విచారణను పూర్తిచేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు.

కాగా, కేసులో లాలూతో పాటు జగన్నాధ్ మిశ్రా, సజల్ చక్రవర్తి తదితరులూ విచారణను ఎదుర్కొననున్నారు. చిబాసా ట్రెజరీ నుంచి డబ్బును విత్ డ్రా చేసిన కేసులో లాలూపై నేరం నిరూపితం కాగా, ట్రయల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఆపై దాణాకే సంబంధించిన మరో కేసు విచారణకు రాగా, ఒకే కుంభకోణానికి సంబంధించి ఒకే వ్యక్తిని పలుమార్లు విచారించలేమని చెబుతూ జార్ఖండ్ హైకోర్టు రూలింగ్ ఇవ్వడంతో లాలూకు తాత్కాలిక ఊరట లభించింది.

  • Loading...

More Telugu News