: అమెరికన్లతో కలసి దూసుకుపోండి: అమెరికాలో చంద్రబాబు పిలుపు


ప్రతి ఒక్క తెలుగువాడు ఒక్కో బాహుబలిగా తయారవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచపటంలో తెలుగువారు సత్తా చాటాలని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన... పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు చంద్రబాబును కలిశారు. బాబును కలిసినవారిలో శాన్ హోజ్ మేయర్ సామ్ లికార్డో, కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా, సెనేటర్ బాబ్ వెల్సీ కౌస్కీ, అసెంబ్లీ సభ్యులు కాన్సాన్ చు, ఆఫ్ కల్రాలు ఉన్నారు. వీరితో సమావేశం ముగిసిన తర్వాత ప్రవాసాంధ్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతికి గుర్తింపు రావాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. కష్టపడే తత్వం మన సొంతమని... ఎక్కడైనా సరే మనం పని చేయగలమని చెప్పారు. సినీ దర్శకుడు రాజమౌళిని చూస్తే తెలుగువాడి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్క తెలుగువాడు ఒక్కో బాహుబలి కావాలని పిలుపునిచ్చారు. స్థానికులతో ప్రవాసాంధ్రులు మమేకమై, అభివృద్ధి దిశలో దూసుకుపోవాలని సూచించారు. విదేశాల్లో స్థిరపడినప్పటికీ, పుట్టిన ఊరును మర్చిపోకూడదని చెప్పారు.

2050 నాటికి కాలిఫోర్నియాతో అమరావతి పోటీ పడుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని విన్నవించారు. అపారమైన సహజవనరులు ఏపీకి వరమని చెప్పారు. రికార్డు సమయంలోనే పట్టిసీమను పూర్తిచేశామని తెలిపారు. పోలవరం పూర్తైతే ఏపీలో కరవు అనేదే ఉండదని చెప్పారు. ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News