: భార్య కాళ్లు, చేతులు కట్టేసి.. ఆమె కళ్లముందే ఉరేసుకున్న భర్త
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు భార్య కాళ్లు చేతులు కట్టేసి ఆమె చూస్తుండగానే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పుగూడ అశోక్‌నగర్‌కు చెందిన కె.కార్తీక్ కుమార్ (19) డీజే ఆపరేటర్. మేనమామ కుమర్తె దీపారాణితో ఏడు నెలల క్రితమే వివాహమైంది. శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన కార్తీక్ ఆర్థిక ఇబ్బందుల గురించి భార్యతో చెప్పుకుని బాధపడ్డాడు.
అనంతరం మత్తులో మద్యం బాటిల్‌తో తలపై బాదుకోవడం మొదలుపెట్టాడు. అతడి ప్రవర్తను చూసి భయపడిన భార్య వెంటనే అతడిని అడ్డుకుంది. దీంతో విచక్షణ కోల్పోయిన కార్తీక్ భార్య దీపారాణి కాళ్లు, చేతులు కట్టేశాడు. అనంతరం ఆమె చున్నీతో ఇంటి పైకప్పుకు ఉరేసుకున్నాడు. కళ్ల ముందే జరుగుతున్న ఘోరాన్ని చూసి షాకైన దీప పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కార్తీక్‌ను కిందికి దింపి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అప్పటికే కార్తీక్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.