: ఉగ్రవాది అంత్యక్రియల్లో తుపాకితో గౌరవ వందనం... జనంలో కలిసిపోయి తుపాకులు పేల్చిన టెర్రరిస్టులు!
కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తమకు తాము వీరులుగా అభివర్ణించుకుంటున్నారు. శనివారం పోలీసుల కాల్పుల్లో మరణించిన లష్కరే తాయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫయాజ్ అహ్మద్ అష్వర్ అలియాస్ సేతాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనంలో కలిసి పోయిన నలుగురు ఉగ్రవాదులు ఫయాజ్‌కు తుపాకులు కాల్చి గౌరవ వందనం సమర్పించడం కలకలం రేపింది.
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో శనివారం ఓ పోలీసు బృందాన్ని లష్కరే ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది ఫయాజ్‌తోపాటు అహ్మద్ షేక్ అనే కానిస్టేబుల్, ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఉధంపూర్ ఉగ్రదాడి కేసులో నిందితుడైన ఫయాజ్ ఆగస్టు 2015 నుంచి పరారీలో ఉన్నాడు.