: ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది అల్లుళ్లే.. కూతుళ్ల పాత్రేమీ లేదు: దగ్గుబాటి వెంకటేశ్వరరావు
నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది అల్లుళ్లేనని, ఇందులో కూతుళ్ల పాత్రేమీ లేదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ కు పెద్ద అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తోడల్లుడు అయిన వెంకటేశ్వరరావు ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నేను తప్పు చేశా. ఆ రోజు ఎమ్మెల్యేలు అంతా వెళ్లడంతోనే నేనూ చంద్రబాబుతో వెళ్లా. అయితే, నేను చంద్రబాబుతో వెళ్లింది, తిరిగి పార్టీని ఎన్టీఆర్ దగ్గరకు తీసుకురావడానికే.
నాడు, నాకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు అన్నారు. తర్వాత ఆయన సీఎం అయ్యాక, నన్ను కలిసిన వారిని కూడా ఆయన తన దగ్గరకు రానిచ్చేవారు కాదు. నేను డిప్యూటీ సీఎం అయితే, పక్కలో బల్లెం అవుతానని చంద్రబాబు అనుకున్నారు’ అని విమర్శించారు. ఇంకా, నాటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ,‘దగ్గుబాటి అలుగుతారు కానీ, కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి అని ఎన్టీఆర్ నమ్మేవారు. నేను అలగడం కూడా నా ఎదుగుదలకు ఇబ్బంది అయిందంటారు. ఎన్టీఆర్ బతికుంటే రాజకీయ ముఖచిత్రం వేరేలా ఉండేది’ అని చెప్పుకొచ్చారు.