: ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’.. ఆ పేరు వినగానే నేను సిగ్గుపడ్డాను: పోప్ ఫ్రాన్సిస్
‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’.. ఆ పేరు వినగానే తాను సిగ్గుపడ్డానని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ప్రాణాలు తీసే బాంబుకు అమ్మ పేరు పెట్టడం ఏంటని, అమ్మ జన్మనిస్తుంది కానీ, ఇది ప్రాణం తీస్తుందని, అలాంటి దాన్ని మనం ‘అమ్మ’ అంటున్నామని, అసలు, ఏం జరుగుతున్నదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కాగా, ఈ నెల 24వ తేదీన పోప్ ను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవనున్నారు. వాతావరణ మార్పులు, శరణార్థులు, వలసలు తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించనున్నారు.
ఈ నేపథ్యంలో మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పై ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ను అధికారికంగా జీబీయూ-43 మాసివ్ ఆర్డనెన్స్ ఎయిర్ బ్లాస్ట్ (ఎంవోఏబీ) అని పిలుస్తారు. ఆఫ్ఘనిస్థాన్ లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై గత నెలలో ఈ బాంబును అమెరికా ప్రయోగించిన విషయం విదితమే.