: యూఎస్ లో వేర్వేరు ఘటనలు... దంపతులు సహా నలుగురు భారతీయుల దారుణ హత్య
యూఎస్ లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో దంపతులు సహా నలుగురు భారతీయులు హత్యకు గురయ్యారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియాలోని మొడెస్టోలో ఓ కిరాణ దుకాణం నిర్వహిస్తున్న జగ్జీత్ సింగ్ (32)ను దుకాణానికి వచ్చిన ఓ అమెరికన్ దూషిస్తూ, హత్య చేశారు. సిగరెట్ అడిగితే, గుర్తింపు కార్డును చూపాలని కోరినందుకు, జాతి దూషణలకు దిగిన సదరు వ్యక్తి ఆగ్రహంతో హెచ్చరిస్తూ వెళ్లిపోయాడు. ఆపై కాసేపటికి జగ్జీత్ సింగ్ దుకాణం బయటకు రాగా పదునైన కత్తి తీసుకుని దాడి చేశాడు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన మరణించారు.
మరో ఘటనలో కేరళకు చెందిన రమేష్ కుమార్ అనే డాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారులోనే తుపాకితో కాల్చి హత్య చేశారు. రమేష్ గతంలో భారత సంతతి వైద్యుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఇంకో ఘటనలో సిలికాన్ వ్యాలీలో పని చేస్తున్న నరేన్ ప్రభు దంపతుల కుమార్తె ప్రేమ వ్యవహారం వారి ప్రాణాలను హరించింది. వారి కుమార్తెతో కొంతకాలం ప్రేమాయణం సాగించిన మీర్జా టాట్లిక్ అనే 24 సంవత్సరాల యువకుడు, వారి ఇంట్లోనే నరేన్ ప్రభు, అతని భార్యపై కాల్పులకు దిగి హత్య చేశాడు. ఆపై పోలీసులతో గొడవ పడి, వారి కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.