: గుర్తు కొస్తే దీక్షలు, ఖాళీగా ఉంటే లేఖలు... జగన్ కు ఇంకేం పని?: కొల్లు రవీంద్ర
విపక్ష నేత వైఎస్ జగన్ కు గుర్తుకొస్తే దీక్షలు చేయడం, ఖాళీగా ఉంటే లేఖలు రాయడం మినహా మరో పని లేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ రాసిన లేఖల్లో ఒక్కటి కూడా వాస్తవమైనది లేదని చెప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లను తమ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. నిరుద్యోగులను ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపిస్తూ, యువతను తప్పుదారి పట్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. నవ్యాంధ్రకు ఐటీ కంపెనీలను తీసుకువచ్చే లక్ష్యంతోనే చంద్రబాబు అమెరికాలో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పరిశ్రమలను తీసుకువచ్చామని, మూడేళ్లలో 3.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.