: మహిళలపై మోదీ సర్కారు వరాల జల్లు!
దేశ జనాభాలో సగం ఉన్నప్పటికీ, సాధికారతకు నోచుకోని మహిళలపై మోదీ సర్కారు మరిన్ని వరాలను ప్రకటించనుంది. ఆదాయపు పన్ను పరిధులను మరింతగా పెంచడంతో పాటు, ఆధార్ ఆధారిత హెల్త్ కార్డులను జారీ చేయడం, ఉచిత ఆరోగ్య పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు నగదు రహిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన ఏర్పడిన కేంద్ర మంత్రుల కమిటీ జాతీయ మహిళా విధానానికి రూపకల్పన చేయగా, ఈ కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు నరేంద్ర మోదీ సైతం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
2001 నుంచి 2011 మధ్య ఒంటరి యువతుల సంఖ్య 39 శాతానికి పెరగడంతో, ఈ సెగ్మెంట్ లోని వారికి ఆదాయపు పన్నులను మరింతగా తగ్గించాలని సుష్మా కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఇక మహిళలు వాడే ఆరోగ్య, పరిశుభ్ర ఉత్పత్తులపై పన్ను రాయితీలు, మహిళల కోసమే ప్రత్యేకంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు ఉచిత వైద్యం, న్యాయ సేవలను అందించాలని కూడా సిఫార్సు చేసింది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల్లో పురుషులకు ప్రాధాన్యం పెంచడం, వృద్ధులు, వితంతువులకు నివాస సౌకర్యాలు కల్పించడం, 2030 నాటికి పనిచేసే కార్మికుల్లో మహిళల సంఖ్యను 50 శాతానికి పెంచడం, పోటీ పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిలకు పూర్తి ఫీజు రాయితీ, ఉచిత కోచింగ్, నగరాల్లో వర్కింగ్ ఉమెన్స్ కు ఉచిత హాస్టళ్ల ఏర్పాటు వంటి అంశాలపైనా ఈ కమిటీ కీలక సిఫార్సులు చేసింది.