: టాంజానియాలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన స్కూలు బస్సు.. 35 మంది దుర్మరణం
టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూలు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, స్కూలు బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. ఉత్తర పర్యాటక ప్రాంతంలోని అరుషాలో శనివారం ఈ విషాదం చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
వర్షం పడుతున్న సమయంలో కొండ ప్రాంతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అరుషా పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా? లేక సాంకేతిక కారణమా? అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. లక్కీ విన్సెంట్ స్కూలు విద్యార్థులు మరో స్కూలును సందర్శించేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు వివరించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదాన్ని జాతీయ విషాదంగా ఆయన అభివర్ణించారు.