: వైసీపీ అధినేత జగన్ ను చూడాలన్న కోరికతో ఏడో తరగతి విద్యార్థి సాహసం!
వైకాపా అధినేత వైఎస్ జగన్ ను చూడాలని, ఆయనతో మాట్లాడాలన్న కోరికతో ఏడో తరగతి చదివే విద్యార్థి పెద్ద సాహసాన్నే చేశాడు. చివరికి అతని కోరికను తీర్చుకున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం ముద్దవరం గ్రామానికి చెందిన పన్నెండేళ్ల ప్రసాద్ కు జగన్ అంటే ఎంతో అభిమానం. ఎలాగైనా ఆయన్ను కలవాలన్న కోరికతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలెక్కి వచ్చేశాడు. కాచిగూడలో దిగిన ప్రసాద్, తనకు కనిపించిన వారినందరినీ జగన్ ఇంటి గురించి వాకబు చేస్తూ, వైకాపా కార్యాలయం వరకూ వచ్చాడు.
ఆఫీస్ దగ్గరికైతే వచ్చాడు కానీ, లోపలికి వెళ్లి జగన్ ను ఎలా కలవాలో తెలియక ఉండిపోయాడు. చివరికి తానెవరు? ఎందుకు వచ్చానన్న వివరాలను అక్కడి సెక్యూరిటీకి చెప్పి, జగన్ ను కలిసేలా చేయాలని ప్రాధేయపడ్డాడు. జగన్ ను కలవడం కుదరదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా, వినకుండా అక్కడే ఉండిపోయాడు. బాలుడి విషయం తెలుసుకున్న జగన్, అతన్ని లోపలికి పిలిపించుకున్నారు. భోజనం పెట్టించి, క్షేమ సమాచారాలు అడిగారు. తనతో ఫోటో తీయించి, దాన్ని ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. అతని క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. రెండు రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకుని ఆతిథ్యం ఇచ్చి, ఆపై ఇంటికి పంపారు. ఇక తన అభిమాన నేత ఇచ్చిన ఆతిథ్యానికి ప్రసాద్ ఉబ్బితబ్బిబ్బవుతూ ఇల్లు చేరాడు.