: చిగురుటాకులా వణికిన ఢిల్లీ జట్టు... 'ముంబై ఇండియన్స్' ముందు పేకమేడలా కుప్పకూలి ఘోర పరాజయం!
మూడు రోజుల్లో ఎంత తేడా? గుజరాత్ లయన్స్ జట్టుపై ఆకాశమే హద్దుగా చెలరేగి 209 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేరుకున్న జట్టేనా ఇది? ముంబై ఇండియన్స్ తమ ముందుంచిన 213 పరుగులను అందుకోవడంలో ఏ మాత్రం పోరాట పటిమను చూపలేదు సరికదా... ఒకరి తరువాత ఒకరు పెవీలియన్ కు చేరుతూ 146 పరుగుల భారీ తేడాతో జట్టు ఓటమికి కారకులయ్యారు. జట్టులో యువ ఆటగాళ్లుగా, భవిష్యత్ స్టార్లుగా పేరు తెచ్చుకున్న రిషబ్, సామ్సన్ లు పరుగులేమీ చేయకపోవడంతో ఓటమితో పాటు ఢిల్లీ ప్లే ఆఫ్ అవకాశాలు కూడా క్లిష్టతరమయ్యాయి.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టులో సిమన్స్ 66, పొలార్డ్ 63, హార్దిక్ పాండ్యా 29 పరుగులు సాధించడంతో 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది. ఆపై ఢిల్లీ జట్టు బ్యాటింగ్ కు రాగా, 13.4 ఓవర్లలో 66 పరుగులకే ఢిల్లీ జట్టు ఆటగాళ్లంతా వెనక్కు వచ్చేశారు. తొలి ఆరు ఓవర్లలోనే ఢిల్లీ జట్టు ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి జారిపోయింది. మలింగ, బుమ్రా, హర్భజన్ సింగ్ లు తామేసిన తొలి ఓవర్లలోనే వికెట్లు సాధించడం విశేషం.