: ఈ తీరు మంచిది కాదు: చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తోన్న తీరు మంచికాదని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవాలని ఆ లేఖలో ఆయన డిమాండ్ చేశారు. వారి బాధలు వినేందుకు చంద్రబాబు తీరిక చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
‘టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పటివరకు చెల్లించాల్సిన వాటితో కలిపి రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతిని వెంటనే ఇవ్వాలి. అధికారంలోకి వచ్చి 35 నెలలు గడిచినప్పటికీ ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి అందలేదు. ఇదే విషయంపై ఫిబ్రవరిలోనూ లేఖ రాసిప్పటికీ చంద్రబాబు నుంచి స్పందన లేదు. గ్రూప్స్ పరీక్షలను కూడా మొక్కుబడిగా జరుపుతున్నారు. నిరుద్యోగులకు సర్కారు భరోసా ఇవ్వడం లేదు. ఏపీపీఎస్సీ కూడా రాష్ట్ర నిరుద్యోగుల బాధలను పట్టించుకోవడం లేదు. తీవ్ర నిరుద్యోగం, నిరుద్యోగుల్లో అసంతృప్తి సమాజానికి మంచిదికాదు’ అని వైఎస్ జగన్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.