: పాకిస్థాన్ లో ఇంటర్ పేపర్ లీక్.. భారత్ నిర్వాకమేనని దాయాది దేశం ఆరోపణలు!
తమ దేశంలో తుపాను వచ్చినా అది భారత్ చేసిన కుట్ర వల్లే వచ్చిందని అనేలా ఉంది పాకిస్థాన్ తీరు. తాజాగా తమ దేశంలోని ఓ ప్రాంతంలో లీకైన ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రానికి కారణం భారతేనంటోంది పాక్. సింధ్ ప్రావిన్సులో ఇంటర్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ కావడంతో.. ఇండియన్ సిమ్ కార్డుల ద్వారానే ఇంటర్ పరీక్ష ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయని అక్కడి అధికారులు ఆరోపిస్తున్నారు.
ఇండియన్ సిమ్ కార్డుల వల్ల తాము నిర్వహించనున్న ఫిజిక్స్ ప్రశ్నపత్రం పరీక్ష ప్రారంభానికి నలబై నిమిషాల ముందు లీకైపోయానని పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రదేశంలో బహిరంగంగానే కాపీయింగ్‌కు పాల్పడుతున్నారని అక్కడి మీడియా ఇటీవలే పలు కథనాలు ప్రసారం చేసింది. ఇప్పుడు అక్కడి అధికారులు మాత్రం ఇలా కొత్త ఆరోపణలు చేస్తున్నారు. భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని థార్పర్కార్ జిల్లాలో ఇండియా సిమ్ కార్డులను ఉపయోగిస్తుంటారు.