: టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేపై చర్యలు తప్పవు: బీసీసీఐ అధికారులు
ఐసీసీతో బీసీసీఐకి తలెత్తిన విభేదం నేపథ్యంలో వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ఇంకా ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమయంలో టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే చేసిన పలు వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉన్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు కుంబ్లే బీసీసీఐకి చెప్పాడు.
అయితే, బోర్డు అభిప్రాయానికి వ్యతిరేకంగా కుంబ్లే వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... చాంపియన్స్ ట్రోపీలో భారత్ ఆడాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది బోర్డేనని, వ్యక్తులు కాదని, తాము ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలని కోరుకుంటున్నట్లు కుంబ్లేని బోర్డుకు లేఖ రాయమని ఎవరూ అడగలేదని అన్నారు. ఇందులో అతడి జోక్యానికి తావు లేదని వ్యాఖ్యానించారు. మరో అధికారి మాట్లాడుతూ.. బోర్డు సభ్యులు బీసీసీఐని నియంత్రణలోకి తీసుకోగానే కుంబ్లేపై చర్యలు తప్పవని, ఇందుకు కొంత కాలం పడుతుందని తేల్చిచెప్పారు.