: స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి.. తండ్రినే బెదిరించి రూ.10 లక్షలు కొట్టేయాలనుకుని దొరికిపోయింది!


నోయిడాలో ఉండే శివ అగర్వాల్ అనే వ్య‌క్తికి ఓ ఫోన్ కాల్ వ‌చ్చింది. ‘మీ కూతురిని కిడ్నాప్ చేశాం, అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే ఆమెను విడిచిపెట్టేదిలేదు’ అని ఆ ఫోన్‌లో హెచ్చ‌రిక వ‌చ్చింది. వెంట‌నే 10 ల‌క్ష‌ల రూపాయ‌లు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని ఫోన్ చేసిన వ్య‌క్తి అన్నాడు. దీంతో తీవ్రంగా ఆందోళ‌న చెందిన ఆ తండ్రి వెంట‌నే కంగారుగా వారు అడిగినంత డ‌బ్బుని పంపించాడు. అనంత‌రం శివ అగర్వాల్ ఈ విషయాన్ని యూపీ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బందికి తెలిపారు. అయితే, వేగంగా ద‌ర్యాప్తు జ‌రిపిన పోలీసుల‌కు ఓ నిజం తెలిసింది. శివ అగ‌ర్వాల్‌కు అలా ఫోన్ చేయించింది ఆయ‌న కూతురేన‌ని పోలీసులు క‌నిపెట్టారు.

శివ అగ‌ర్వాల్ కూతురు 20 ఏళ్ల ముస్కన్‌ అగర్వాల్‌ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ కిడ్నాప్‌ డ్రామా ఆడిందని, ఆమె కాన్పూర్‌లోని ఐటీ ఇనిస్టిట్యూట్‌లో ఇంజినీరింగ్‌ చదువుతోంద‌ని పోలీసులు మీడియాకు తెలిపారు. తాను కిడ్నాప్‌కు గురైనట్లు తన తండ్రికి ఫోన్‌ చేసి వెంటనే రూ.10 లక్షలు పంపించాలని, లేదంటే విడిచిపెట్టమని బెదిరించమని ఆమే త‌న‌ స్నేహితులతో చెప్పించిందని పోలీసులు చెప్పారు. తాము చెప్పిన అకౌంటులో ఆ తండ్రి డబ్బులు వేసిన వెంటనే అనంత్‌, రితురాజ్‌సింగ్‌ అనే వ్యక్తులు ఏటీఎం ద్వారా ముస్కన్‌ ఖాతా నుంచి రూ.30 వేలు డ్రా చేయడాన్ని తాము గుర్తించామ‌ని, దీంతో ఈ కేసులో నిజానిజాలు తెలిశాయ‌ని తెలిపారు.

శివ అగ‌ర్వాల్ కూతురు ముస్కన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ అదిత్య శ్రీవాస్తవతో పారి చౌక్‌లోని పార్కులో ఉన్నట్లు తాము తెలుసుకున్నామ‌ని, వెంటనే అక్కడికి చేరుకుని అరెస్టు చేశామ‌ని తెలిపారు. ఈ ప‌ని ఎందుకు చేశావ‌ని ఆ యువ‌తిని పోలీసులు ప్ర‌శ్నించ‌గా ముస్క‌న్‌ అందుకు కార‌ణాన్ని వివ‌రించింది. తనతో పాటు చదువుకుంటున్న త‌న‌ స్నేహితులురాలికి తాను ఇటీవ‌ల‌ రూ.4 లక్షలు డబ్బులు ఇచ్చాన‌ని, ఆ విష‌యం తెలుసుకున్న త‌న తండ్రి తిరిగి ఆ డ‌బ్బు తీసుకురమ్మని ఒత్తిడి చేశాడ‌ని, దీంతో ఏం చేయాలో తెలియ‌క ఇలా కిడ్నాప్ డ్రామా ఆడి త‌న తండ్రి నుంచే డబ్బును తీసుకొని మ‌ళ్లీ ఇచ్చేద్దామ‌నుకున్నాన‌ని ఆమె తెలిపింది.

  • Loading...

More Telugu News