: కట్టప్ప, శివగామి రొమాన్స్: థియేటర్లలో ఆ దృశ్యాలు చూసి షాక్ అవుతున్న అభిమానులు!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాల్లో కట్టప్పగా సత్యరాజ్, రాజమాత శివగామిగా రమ్యకృష్ణలు కనిపించిన పాత్రల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివగామి ఏదీ చెప్పినా అది చేసేసే బానిసగా, ఆమెను ఓ దేవతలా చూసే వ్యక్తిగా కట్టప్ప కనబడతాడు. అయితే, బాహుబలి-2 విశ్రాంతి సమయంలో బయటకు వెళ్లి లోపలికి వస్తోన్న ప్రేక్షకులు తిరిగి తెరపై కనిపిస్తోన్న ఓ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇదేం ట్విస్ట్ అని అనుకుని, కాసేపటికి తేరుకుంటున్నారు.
స్క్రీన్‌పై శివగామి (రమ్యకృష్ణ), కట్టప్ప (సత్యరాజ్) పక్కపక్కనే కూర్చుని రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. శివగామి (రమ్యకృష్ణ) సిగ్గుపడుతూ, కట్టప్ప (సత్యరాజ్) పై అలుగుతూ దూరంగా జరుగుతుంది. అందులో కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా కూడా ఇస్తాడు. చివరగా 'పోతిస్ యాడ్' అని తెరపై కనిపిస్తుంది. బాహుబలి క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఆ కంపెనీ ఈ యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్‌లో రాజుగా సత్యరాజ్, రాణిగా రమ్యకృష్ణ కనిపిస్తారు. బాహుబలి సినిమాలో అలా కనిపించిన వీరిద్దరు విశ్రాంతి సమయంలో ఒక్కసారిగా ఇలా తెరపై దర్శనం ఇవ్వడంతో కాసేపు ప్రేక్షకులు షాకైపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ హల్‌చల్ చేస్తోంది.