: ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 91.92%
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలను ఈ రోజు విశాఖపట్నంలో ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 6,22,538 మంది హాజరయ్యారు. వారిలో 5,60,253 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 91.92గా ఉంది. గత ఏడాది ఉత్తీర్ణత శాతం 94.52గా ఉందని, అంతకు ముందు ఏడాది 91.42 వచ్చిందని గంటా శ్రీనివాసరావు చెప్పారు.
గతేడాది కంటే ఈ సారి 2.6 శాతం తగ్గిందని అన్నారు. ఈ పరీక్షల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి 97.99 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి, ఆ జిల్లాను టాప్ ప్లేస్ లో నిలబెట్టారని, చిత్తూరు జిల్లా నుంచి 80.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఆ జిల్లా నుంచి అత్యల్పంగా ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 91.97 గా ఉందని, బాలుర ఉత్తీర్ణ శాతం 91.87 గా ఉందని అన్నారు. రాష్ట్రంలో రెండు ప్రైవేట్ స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులు 18,225 మంది ఉన్నారని పేర్కొన్నారు.