: 25 పైసల కోసం ఊడిపోయిన ఉద్యోగాన్ని 23 ఏళ్ల తరువాత తిరిగి ఇవ్వాలని ఆదేశించిన న్యాయస్థానం


25 పైసల కోసం 23 ఏళ్ల క్రితం కోల్పోయిన ఉద్యోగాన్ని తిరిగి పొందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే... చార్మినార్‌–ఫతేదర్వాజ మార్గంలో నడిచే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఎం.ఎల్‌.అలీ అనే వ్యక్తి కండక్టర్‌ గా బాధ్యతలు నిర్వర్తించేవాడు. 1993 అక్టోబర్‌ 27న ఆర్టీసీ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ స్క్వాడ్‌ అధికారులు అలీ విధులు నిర్వర్తిస్తున్న బస్సులో తనిఖీలు చేశారు. ఆసమయంలో ఒక ప్రయాణికుడి నుంచి 50 పైసలు వసూలు చేసి టికెట్‌ ఇవ్వలేదని, అలాగే మరో ఇద్దరు మహిళలు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నా పట్టించుకోలేదని నిర్ధారించిన, అధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతనిని విధుల నుంచి తొలగిస్తూ 1994 మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భాధితుడు ఈ ఉత్తర్వులను అప్పీలెట్‌ అథారిటీ, రివ్యూ అథారిటీ ముందు సవాల్ చేశాడు.

అయితే అవి కూడా అధికారుల చర్యలను సమర్థించడంతో 1997లో ఇండస్ట్రియల్‌ ట్రైబ్యునల్‌ ను ఆయన ఆశ్రయించాడు. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసిన అలీ ఘటనపై... పూర్తిస్థాయిలో విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ అలీకి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. అయితే దానికి అంగీకరించని, ఆర్టీసీ యాజమాన్యం 1999లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో ఈ కేసును విచారించిన సింగిల్‌ జడ్జి ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను సమర్థిస్తూ అలీని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దానిని కూడా అంగీకరించని ఆర్టీసీ యాజమాన్యం 2009లో డివిజన్ బెంచ్ లో అప్పీలు చేసింది.

దీనిని విచారించిన ద్విసభ్య బెంచ్...75 పైసల టికెట్‌ కోసం ప్రయాణికుడు 50 పైసలు ఇచ్చాడని, మిగిలిన 25 పైసల కోసం డిమాండ్‌ చేస్తూ తాను టికెట్‌ ఇవ్వలేదని, ఈ మధ్యలోనే స్క్వాడ్‌ వచ్చి తనిఖీలు చేసిందన్న కండక్టర్‌ వాదనను అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇద్దరు మహిళల వద్దకు వచ్చి టికెట్‌ ఇచ్చేలోపే స్క్వాడ్‌ కండక్టర్ చేతి నుంచి రిపోర్ట్ లాక్కుని, డ్రైవర్ వాదనను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పు పట్టిన న్యాయస్థానం... అతనిని విధులలోకి తీసుకోవాలని, అతనికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో న్యాయస్థానం న్యాయం చేసిందని అలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News