: దక్షిణాసియా ఉపగ్రహానికి భారత్ ఖర్చు చేసింది ఎంతో తెలుసా? అక్షరాలా 450 కోట్లు!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం విజయవంతంగా ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహం జిశాట్-9 విజయవంతంగా కక్ష్యలోకి చేరుకుంది. ప్రధాని నరేంద్రమోదీ మదిలో మూడేళ్ల క్రితం మొగ్గతొడిగిన ఆలోచన నేడు దక్షిణాసియాలో భారత్‌ను సమున్నత స్థానంలో నిలబెట్టింది. జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్(జీశాట్-9)గా పిలిచే ఈ ఉపగ్రహ సేవలను ఆరు పొరుగు దేశాలు అందుకోనున్నాయి. పొరుగు దేశాలతో భారత్ ఎటువంటి సంబంధాలను కోరుకుంటుందన్న విషయం జీశాట్-9 ప్రయోగంతో మరోమారు తేటతెల్లమైంది. కాగా ఉపగ్రహ తయారీ నుంచి ప్రయోగం వరకు మొత్తం రూ.450 కోట్లను ఇస్రో ఖర్చు చేసింది. కేవలం ఉపగ్రహ నిర్మాణానికే రూ.235 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఇస్రో అధికారుల ద్వారా తెలిసింది.