: అలిగి కారు దిగి.. బస్సెక్కిన భర్తను ఛేజ్ చేసి పట్టుకుని, తుపాకీతో కాల్చి పడేసిన భార్య!
తనపై అలిగి కారుదిగి, బస్సెక్కిన భర్తను ఛేజ్ చేసి, బస్సులో నుంచి అతనిని దించి తుపాకీతో కాల్చేసిన ఘటన కర్ణాటకలోని హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్ వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్ లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. సాయిరామ్ (53) సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్ రెసిడెన్సిలో సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు. కారులో వీరి మధ్య వివాదం ప్రారంభమైంది. భార్య తీరుపై అసహనంతో... వీరసంద్ర గేట్ సమీపంలో సాయిరామ్ కారు దిగి బీఎంటీసీ బస్సు ఎక్కాడు.
దీనిని తీవ్రంగా పరిగణించిన సాయిరామ్ భార్య... కారును వేగంగా నడిపింది. తర్వాత దానిని ఓవర్ టేక్ చేసి, నేరుగా బస్సు ముందుకు కారును తెచ్చి అడ్డంగా ఆపింది. భర్తను బలవంతంగా బస్సు దింపి రివాల్వర్ తో మూడుసార్లు కాల్చింది. అతని కడుపు, ఎద భాగంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆమెను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, వారికి తుపాకీ చూపించి, కాల్చిపారేస్తానని ఆమె బెదిరించింది. కాల్పుల కలకలంతో అక్కడికి చేరుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.