: భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న సౌదీ, పాక్ చానళ్లపై ఉక్కుపాదం.. నిషేధం విధించిన కేంద్రం
భారత్‌కు వ్యతిరేకంగా జమ్ము కశ్మీర్‌లో ప్రచారం చేస్తున్న పాకిస్థాన్, సౌదీ అరేబియా దేశాలకు చెందిన టెలివిజన్ చానల్స్‌పై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఆయా చానళ్లను నిషేధిస్తున్నట్టు పేర్కొంది. జమ్ముకశ్మీర్‌లో డీటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉన్నా పాకిస్థానీ, సౌదీ చానళ్లను ప్రసారం చేస్తుండడంతో చాలామంది కేబుల్ టీవీనే వాడుతున్నారు.
కేబుల్ సర్వీసు ద్వారా వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌కు చెందిన పీస్ టీవీతోపాటు సౌదీ ఖురాన్, సౌదీ సున్నా, అల్ అరేబియా, పైఘం, హిదాయత్, నూరు, మదాని, కర్బాలా, హడి, షహర్, ఆరీ క్యూటీవీ, బేతత్ మెసేజ్, ఫలాక్, అహ్లిబాట్, జియో న్యూస్, ఆరి న్యూస్, డాన్ న్యూస్ వంటి చానల్స్ ప్రసారం అవుతున్నాయి. ఈ చానళ్ల ద్వారా ఉగ్రవాదం వ్యాప్తి చెందుతోందని భావించిన సమాచార మంత్రిత్వ శాఖ సౌదీ, పాక్ టీవీ చానళ్లను నిషేధించింది. ఆయా చానళ్లు కశ్మీరీ ప్రజలకు ఉగ్రవాదాన్ని బోధిస్తున్నాయని, ఉగ్రవాద వ్యాప్తికి కారణమవుతున్నాయన్న ఉద్దేశంతో వాటిపై నిషేధం విధించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.