: ప్రణబ్ ఓకే అంటే రాష్ట్రపతిగా రెండోసారి కూడా ఆయనే.. మద్దతిస్తామంటున్న విపక్షాలు!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఆయన కనుక అంగీకరిస్తే మరోసారి ఆయనను రాష్ట్రపతిని చేస్తామని అంటున్నాయి విపక్షాలు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా విపక్షాలను ఒక్కటి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రణబ్‌ను మళ్లీ రాష్ట్రపతిగా బీజేపీ నామినేట్ చేస్తే తాము మద్దతు ఇస్తామని విపక్ష నేతలు చెబుతున్నారు.
మరోవైపు రెండోసారి కొనసాగే విషయంలో తనకు అంత ఆసక్తి లేదని ప్రణబ్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అంతేకాక బీజేపీ తనను రెండోసారి నామినేట్ చేసే అవకాశం లేదని భావిస్తున్న ప్రణబ్, ఎన్నికల బరిలో దిగేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కాగా, ఇప్పటి వరకు బాబు రాజేంద్రప్రసాద్ ఒక్కరే రాష్ట్రపతిగా రెండుసార్లు కొనసాగారు. అలాగే ప్రస్తుత రాష్ట్రపతి పదవిలో కొనసాగుతున్న వ్యక్తి మళ్లీ పోటీకి దిగిన దాఖలాలు లేవు. దీంతో రాష్ట్రపతిగా బీజేపీ ఎవరిని నామినేట్ చేస్తుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.