: తెలంగాణ సమస్యపై నిర్ణీత గడువు లేదు: కేంద్ర హోంమంత్రి
తెలంగాణ అంశం పరిష్కారానికి నిర్ణీత గడువు ఏమీ లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఢిల్లీలో ఇంతకు క్రితం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన, తెలంగాణ అంశం ముగిసిన అధ్యాయం కాదనీ, ఈ సమస్యపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
పార్లమెంటుపై దాడి కేసులో ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయడం నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు. అఫ్జల్ ను ఉరితీసే ముందు రోజు (ఫిబ్రవరి 7వ తేదీ) రాత్రే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని ఆయన తెలిపారు. సమాచారం అందలేదని అఫ్జల్ కుటుంబం అనటం సరికాదని షిండే అన్నారు.
మరోవైపు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పంపిన సమాచారం అతని కుటుంబానికి సోమవారం అందింది. సమాచారం అందలేదని ఓ వైపు అఫ్జల్ కుటుంబం, పంపామని కేంద్ర ప్రభుత్వం వాదప్రతివాదాలు జరుగుతుండగా ఇప్పుడు సమాచారం అందడం కాశ్మీరులో చర్చనీయాంశమైంది.