: సొంత అక్క కొడుకును అన్నట్టే వాడినీ అన్నాను... అంతే!: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివరణ


టీడీపీకి చెందిన ఓ మహిళా ఎంపీటీసీని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా అవమానించారంటూ సోషల్ మీడియా వేదికగా వదంతులు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ వార్త నిజమా? కాదా? అనే విషయమై ఓ న్యూస్ ఛానెల్ ఆయన్ని కలవగా అసలు విషయం చెప్పారు.

 ‘సోషల్ మీడియాలో ఈ వదంతుల విషయాన్ని చాలా మంది చెప్పారు గానీ, నేను పట్టించుకోలేదు. ఇప్పుడే, ఆ వీడియో చూశాను. బొమ్మసాని అరుణకుమారి గారు అని మా పార్టీ ఎంపీటీసీ. నేనే టిక్కెట్టు ఇచ్చాను ఎంపీటీసీగా గెలిపించుకున్నాము. మూడు సంవత్సరాలుగా నాకు ఆమెతో పరిచయం ఉంది. మొదటి రోజు నుంచి ఆమెను అరుణక్క అని పిలుస్తున్నాను. చాలా గౌరవంగా ఉంటాను. ఆమె కూడా నాతో చాలా గౌరవంగా ఉంటారు. నేను లేకపోయినా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లే చనువు కూడా ఆమెకు ఉంది.

ఇదిలా వుండగా, ఏదో గుడి ప్రారంభోత్సవం గురించి నన్ను పిలుద్దామని ఆమె నా ఆఫీసుకు వచ్చిన మాట వాస్తవమే. అయితే, నేను బయటకు వెళడంతో, వేరే వాళ్ల సీట్లో ఆమె కూర్చుంది. ‘ఈ సీటు మీది కాదు.. పీఆర్ కూర్చునే సీటు ఇది. కొంచెం బయటకు వెళ్లి కూర్చోండి’ అని ఎవరో ఆమెతో అన్నారట. దీనికి ఆమె మనస్తాపం చెంది, ఈ విషయాన్ని నాకు చెప్పింది. ఆ మాట ఎవరన్నారో వారిని మందలిస్తాను అని చెప్పి, ఆఫీసులోని వారిని పిలిస్తే ఆమె గుర్తించలేకపోయింది. ఈ డిస్కషన్ జరుగుతుండగానే, వాళ్లబ్బాయి.. కొద్దిగా చిన్నపిల్లాడు..పాతికేళ్ల వయసు ఉంటుంది. తన వయసు ప్రభావం వల్ల కొంచెం స్పీడ్ అయ్యాడు.

దాంతో ‘చిన్న వయసులోనే ఇంత కోపమేంటిరా?’ అన్నాను. ఆమెను అక్కా అంటాను కాబట్టి, సొంత అక్క కొడుకును అన్నట్టే వాడినీ అన్నాను’ అని చెప్పారు. అంతే తప్పా, తానేమి వారిని తీవ్రంగా మందలించలేదని చెప్పారు. అయితే, ఈ విషయంపై వదంతులు వ్యాపింపజేసేందుకు కాచుకు కూర్చున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వాళ్లు సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపింపజేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News