: స్నేహితులకు ఇచ్చిన మాటను భారత్ నిలబెట్టుకుంది: ఆరు దేశాల అగ్రనేతలతో మోదీ
పాకిస్థాన్ మినహా దక్షిణాసియా దేశాలకి సేవలు అందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన జీశాట్-9 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఢిల్లీ నుంచి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, మాల్దీవులు, శ్రీలంక దేశాల అగ్రనేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దక్షిణాసియా దేశాలన్నీ ఒక ఉమ్మడి కుటుంబంలా ఉన్నాయని మోదీ అభివర్ణించారు. ఈ ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ సేవలను పొందవచ్చని, అత్యాధునిక సమాచార వ్యవస్థను అందుకోవచ్చని తెలిపారు.
భారత్ రెండేళ్ల క్రితం దక్షిణాసియా స్నేహితులకు ఈ హామీ ఇచ్చిందని మోదీ అన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీని కానుకగా అందిస్తామని భారత్ చెప్పిందని, చెప్పినట్లుగానే ఇస్రో కృషితో చేసిందని అన్నారు. దక్షిణాసియా మరింత అభివృద్ధిని సాధించేలా అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు దక్షిణాసియాకు చారిత్రాత్మక దినం అని ఆయన అన్నారు. మన ప్రాంత అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడే ఉపగ్రహం ఇది అని ఆయన అన్నారు.