: జీవ రసాయనిక పదార్థాలతో కిమ్ జాంగ్ ఉన్ హత్యకు అమెరికా కుట్ర: ఉత్తర కొరియా ప్రకటన
ఎవ్వరి మాటా వినకుండా వరుసగా అణుపరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాల్లో భయం పుట్టిస్తోన్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆగ్రహంగా వున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా అమెరికాపై ఉత్తర కొరియా పలు తీవ్ర ఆరోపణలు చేసింది. కిమ్ జాంగ్ ఉన్ హత్యకు అమెరికా కుట్ర పన్నినట్లు ఉత్తరకొరియా ప్రకటన చేసి కలకలం రేపింది. ఆయనను అంతమొందించేందుకు అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన ఏజెంట్లు ప్రణాళికలు వేసినట్లు కూడా తమకు తెలుస్తోందని పేర్కొంది.
ఓ ఉగ్రవాద గ్రూపుతో కలిసి తమ దేశాధ్యక్షుడిని చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ దేశ భద్రతా మంత్రి ప్రకటన చేశారు. తాము ఆ ఉగ్ర గ్రూపును నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. తమ అధ్యక్షుడిని జీవరసాయనిక పదార్థాలతో అంతమొందించేందుకు కుట్ర జరిగినట్లు ఆ దేశ వార్తా సంస్థ కేసీఎన్ఏ కూడా వెల్లడించింది. జీవరసాయన పదార్థాలు, రేడియోధార్మిక పదార్థాలు, నానో విషపూరిత పదార్థాలు ఉపయోగించాలని కుట్రదారులు భావిస్తున్నట్లు పేర్కొంది.