: వారిని ఉరితీసి చంపితేనే మనశ్శాంతి: నిర్భయ తల్లి ఆశాదేవి
తన బిడ్డపై అత్యంత దారుణంగా ప్రవర్తించిన నలుగురు దుర్మార్గులకూ ఉరిశిక్షే సరైనదని నిర్భయ తల్లి ఆశాదేవీ వ్యాఖ్యానించారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉరిశిక్షనే ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పివ్వాలని, అప్పుడే మరణించిన తన బిడ్డ ఆత్మకు శాంతి కలుగుతుందని కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆశాదేవి అభిప్రాయపడ్డారు.
అంతకన్నా శిక్ష తగ్గితే, కామాంధులు మరింతగా రెచ్చిపోతారని, మరింత మంది నిర్భయలు బలవుతారని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరిస్తేనే తమ కుటుంబానికి ఊరట, తనకు మనశ్శాంతి లభిస్తాయని తెలిపారు. కాగా, ఈ కేసులో సుప్రీంకోర్టు నలుగురు నిందితుల భవితవ్యాన్ని నేడు తేల్చనున్న సంగతి తెలిసిందే. హైకోర్టు విధించిన శిక్షనే సుప్రీంకోర్టు ఖరారు చేస్తే, వారిక రాష్ట్రపతికి క్షమాభిక్ష, ఆపై సుప్రీంకోర్టుకు రివ్యూ పిటిషన్ లను మాత్రమే దాఖలు చేసుకునే వీలుంటుంది.