: ఎర్రకోట సమీపంలో గ్రనేడ్... ఎన్ఎస్జీకి కబురు!
దేశ రాజధానిలో అత్యంత కట్టుదిట్టమైన పహారా ఉండే ఎర్రకోట వద్ద ఓ గ్రనేడ్ పడివుండటం కలకలం రేపింది. ఫ్యూజ్ తీసిన ఈ గ్రనేడ్ ను చూసిన స్థానికులు కొందరు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేయగా, ఆ వెంటనే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) టీమ్ కు సమాచారాన్ని పంపారు. ఆపై డీసీపీ తదితరులు ఎర్రకోట ప్రాంతానికి వచ్చి తనిఖీలు చేపట్టారు. ఈ గ్రనేడ్ ను తదుపరి పరీక్షల నిమిత్తం పంపించినట్టు తెలిపారు. కాగా, ఈ గ్రనేడ్ ప్రపంచ యుద్ధం కాలం నాటిది కావచ్చని సమాచారం అందుతోంది. రెండు నెలల క్రితం ఎర్రకోటను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టగా, కొన్ని బాక్సుల్లో మందుగుండు, పేలుడు పదార్థాలు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించి ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.