: ప్రియురాలికి చుక్కలు చూపించిన బాయ్ ఫ్రెండ్!
ప్రియురాలికి పట్టపగలు చుక్కలు చూపించి, 30 రోజుల జైలు శిక్షకు గురయ్యాడో వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని ఫ్లోరిడాలో సాబ్రిన్ ఆఫ్ (37) అనే న్యాయవాదికి తన ప్రియురాలిపై అనుమానం వచ్చింది. తనతో మాటలు తగ్గించి, తనపై ఆసక్తి తగ్గించడంతో ఆమె మరో వ్యక్తి ప్రేమలో పడిందా? అన్న అనుమానం పడ్డాడు. అనుమానం సరికాదని, నిర్ధారించుకోవాలని భావించాడు. దీంతో ఆమె కారుకు జీపీఎస్ సిస్టం అటాచ్ చేశాడు. ఏడు నెలలు ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుందో కనుగొన్నాడు. తన అనుమానం నిజమని గుర్తించాడు. ఆమెతో గొడవకు దిగకుండా తన ప్రణాళిక అమలు చేశాడు. ఆమె ఈమెయిల్ ఆధారంగా ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లతో పాటు, ఆమె ఉపయోగించే వివిధ డిపార్ట్ మెంటల్ స్టోర్స్ అకౌంట్లను కూడా హ్యక్ చేశాడు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లతో ఆమె స్నేహితులు, బంధువులకు అసభ్య మెసేజ్ లు పంపాడు.
దీంతో వారు ఆమెను దూరం పెట్టారు. స్నేహితులంతా దూరం పెడుతుండడం పట్ల ఆమె బాధపడ్డప్పటికీ దానికి కారణం తెలియక తల్లడిల్లిపోయింది. ఇంకా శాంతించని సాబ్రిన్ ఎలక్ట్రీసీటీ డిపార్ట్ మెంట్, వాటర్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్లకు కూడా అసభ్య మేసేజ్ లు పంపాడు. దీంతో వారు వారు ఆమె ఇంటికి కరెంట్, వాటర్ కట్ చేశారు. దీంతో ఇది ఎలా జరుగుతోందని పరిశీలించి తన అకౌంట్ నుంచే ఎవరో ఈ మెసేజ్ లు పంపి తన పరువు తీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు... సాబ్రిన్ వీటన్నింటికీ కారణమని గుర్తించి హెచ్చరించి పంపేశారు. దీంతో ఈసారి అతని ప్రేయసి అతనికి మరింత దూరమైంది. పర్యవసానంగా రగిలిపోయిన సాబ్రిన్... ఈ సారి ఆమె క్రెడిట్ అకౌంట్లను హ్యాక్ చేశాడు. వాటితో వివిధ రెస్టారెంట్లలో భారీ మొత్తంలో ఖర్చు చేశాడు. తాను వాడకుండా తన అకౌంట్ డబ్బులు తరిగిపోవడంతో ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. దీంతో బ్యాంకు సీసీ టీవీ పుటేజ్ పరిశీలించి సాబ్రిన్ ఈ పని చేశాడని గుర్తించి, అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో న్యాయస్థానం అతనికి 30 రోజుల జైలు శిక్ష విధించింది.