: సంజుశాంసన్, రిషబ్ పంత్ వీరవిహారం...రేసులోకి వస్తున్న ఢిల్లీ డేర్ డెవిల్స్
ఐపీఎల్ సీజన్ 10 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రేసులోకి వస్తోంది. గుజరాత్ లయన్స్ తో జరిగిన పోరులో దేశవాళీ ఆటగాళ్లు రాణించడంతో ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ లయన్స్ సొంత మొహాలీ మైదానంలో జరిగిన పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా (77), దినేష్ కార్తీక్ (65), ఆరోన్ ఫించ్ (27) జడేజా (18) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 208 భారీ స్కోరు సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఓపెనర్ సంజు శాంసన్ (61), కరుణ్ నాయర్ (12) శుభారంభం ఇవ్వగా, రిషబ్ పంత్ (97) వీర విహారం చేసి సెంచరీ మిస్సయ్యాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (14), కోరె ఆండర్సన్ (18) వేగంగా ఆడడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఖాతాలో నాలుగో విజయం చేరింది. దీంతో పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 6వ స్థానానికి చేరింది. వరుసగా అన్ని మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఢిల్లీ నాకౌట్ పోటీల్లో ఆడుతుంది.