: మరణదండనా? యావజ్జీవమా?: పెను సంచలనం సృష్టించి దేశ చట్టాలను మార్చిన 'నిర్భయ' కేసులో నేడు సుప్రీం తీర్పు
దేశ రాజధాని నడివీధుల్లో 23 సంవత్సరాల వైద్య విద్యార్థిని బస్సులో తిప్పుతూ దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి, ఆమె మరణానికి కారకులైన నలుగురు నిందితులకు నాలుగేళ్ల తరువాత నేడు శిక్ష ఖరారు కానుంది. భారతావనిలో పెను సంచలనం సృష్టించి, ఆపై జాతి యావత్తూ కదలగా, 'నిర్భయ' చట్టం ఆవిష్కరణకు నాంది పలికిన ఈ కేసులో సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెలువరించనుంది.
డిసెంబర్ 16, 2012న అక్షయ్ థాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ లు బస్సులో ఓ యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ట్రయల్ కోర్టు 2013లో మరణశిక్ష విధించగా, నిందితుల పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా, రామ్ సింగ్, తీహార్ జైల్లో మార్చి 2013లో ఉరివేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.
మరో నిందితుడు నేరం చేసే సమయానికి మైనర్ కావడంతో, మూడేళ్ల శిక్షాకాలం తరువాత డిసెంబర్ 2015లో విడుదలయ్యాడు. నిర్బయ కేసు వెలుగులోకి వచ్చిన తరువాతనే, తీవ్రమైన నేరాల విషయంలో బాలనేరస్తుల వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తూ కూడా చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. ఇక ఈ కేసులో జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం నేడు తుది తీర్పును ఇవ్వనుంది.