: మా దేశానికి అధికారిక మతం లేదు: ఐరాసలో ఇండియా స్పష్టీకరణ
మైనారిటీలకు పూర్తి రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి స్పష్టం చేశారు. ఇండియాలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని పాకిస్థాన్ వేలెత్తి చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇండియాలో అధికారిక మతం అంటూ ఏదీ లేదని, తమది సెక్యులర్ దేశమని స్పష్టం చేశారు. మైనారిటీల రక్షణకు రాజ్యాంగంలోనే విధానాలను పొందుపరిచిన దేశమని తెలిపారు. ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గుర్తు చేసిన ఆయన, వాక్ స్వాతంత్ర్యాన్ని తాము గుర్తించామని, భారతీయులకు రాజకీయ స్వేచ్ఛ ఉందని అన్నారు.
కాగా, ప్రతి నాలుగేళ్లకోమారు జరిగే ఐరాస హక్కుల కౌన్సిల్ సమావేశాలు జరుగగా, భారత ఉన్నత న్యాయాధికారి హోదాలో ప్రసంగించిన రోహత్గి, తన ప్రసంగంలో 'కోర్టు' అన్న పదాన్ని 21 సార్లకు పైగా వాడారు. యాకూబ్ మెమన్ పేరును ప్రస్తావించకుండా, అర్థరాత్రి 2 గంటలకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సమావేశమై, ఆయన అపీలును పరిశీలించిన వైనాన్ని, ట్రాన్స్ జండర్ లను థర్డ్ జండర్ లుగా మార్చిన విషయాన్ని, పర్యావరణ పరిరక్షణపై కోర్టుల ఆదేశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సమావేశాల్లో భాగంగా ఇటలీ, ఇజ్రాయిల్, జపాన్ తదితర దేశాలు భారత్ లో మరణశిక్షను రద్దు చేయాలని కోరాయి. దీనిపై మాత్రం రోహత్గి ఎటువంటి సమాధానమూ చెప్పలేదు.