: లోకేశ్‌పై విరుచుకుపడడం మాని జగన్‌ను ఆస్తులు ప్రకటించమనండి: వైసీపీకి వర్ల సూచన
రాష్ట్ర మంత్రి లోకేశ్‌పై అనవసర ఆరోపణలు మాని దమ్ముంటే ఆస్తులు ప్రకటించాలంటూ జగన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య వైసీపీ నేతలకు సూచించారు. నీతి, నిజాయతీగా పనిచేస్తూ తన ఆస్తులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న లోకేశ్‌పై విరుచుకుపడడం కాదని, అవినీతి సంపాదనతో కూడబెట్టిన ఆస్తులను జగన్ ప్రకటిస్తాడో లేదో ఒత్తిడి తేవాలని వైసీపీ నేత పార్థసారథికి సూచించారు.
తనపై ఆరోపణలు చేసేవారు 48 గంటల్లో నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని లోకేశ్ చేసిన సవాలును స్వీకరించే దమ్ము వైసీపీ నేతలకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అందుకే స్పందించడం లేదని వర్ల అన్నారు. మంత్రి కేఈ కృష్ణమూర్తికి గౌరవం ఎలా ఇవ్వాలో టీడీపీకి తెలుసని, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. లోకేశ్ విషయంలో అనవసర రాద్దాంతం వద్దని, జగన్ అవినీతిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని వర్ల సవాల్ విసిరారు.