: అమెరికా చేరుకున్న చంద్రబాబు.. పెట్టుబడుల వేట ప్రారంభం!
నవ్యాంధ్రకు పెట్టుబడులు రప్పించడమే ధ్యేయంగా అమెరికా బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం షెడ్యూలు కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సహా పలువురు ఉన్నతాధికారులున్న ఈ బృందం వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, షికాగో నగరాల్లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు, ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు.
నేటి (శుక్రవారం) ఉదయం స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అల్పాహార విందుతో చంద్రబాబు బృందం పర్యటన అధికారికంగా ప్రారంభం అవుతుంది. అనంతరం కాలిఫోర్నియా, ఇల్లినాయిస్‌తో సిస్టర్ స్టేట్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. వ్యవసాయ రంగంలో ఐయోవాతో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. అలాగే వివిధ సంస్థలకు చెందిన 300 మంది సీఈవోలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థ యాపిల్ కంపెనీ చిత్తూరు, లేదంటే అనంతపురం జిల్లాలో యూనిట్ ఏర్పాటుకు సిద్ధమవుతుండడంతో మైక్రోసాఫ్ట్‌ను కూడా ఏపీకి రప్పించేందుకు చంద్రబాబు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు.