: ముంబై నుంచి అబుదాబికి బయలుదేరిన భారీకాయురాలు ఎమాన్ అహ్మద్!
ఈజిప్ట్‌కు చెందిన భారీ కాయురాలు ఎమాన్ అహ్మద్ ముంబై ఆస్పత్రి నుంచి అబుదాబి బయలుదేరి వెళ్లింది. విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్ చొరవతో స్వస్థలం అలెగ్జాండ్రియా నుంచి ముంబైలోని సైఫీ ఆస్పత్రికి చేరిన ఎమాన్‌కు డాక్టర్ లక్టావాలా ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ప్రత్యేక చికిత్సలు అందించింది. 500 కేజీలతో ఆస్పత్రిలో చేరిన ఆమె బరువును ప్రస్తుతం 330 కేజీల వరకు తగ్గించగలిగామని వైద్యులు చెబుతుండగా ఎమాన్ సోదరి షైమా మాత్రం వైద్యులు మోసం చేస్తున్నారని, ఆమె బరువులో ఏమాత్రం తేడా లేదని పేర్కొంటూ సంచలనం సృష్టించింది. తన సోదరిని తిరిగి తీసుకెళ్తున్నట్టు పేర్కొంది. అన్నట్టుగానే గురువారం మధ్యాహ్నం ఆమెను అబుదాబికి తీసుకెళ్లింది. ఎమాన్ తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సైఫీ ఆస్పత్రి నుంచి విమానాశ్రయం వరకు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.