: ప్రియుడితో పెళ్లి చేయాలని సెల్ టవర్ ఎక్కి బెదిరించిన వివాహిత!


త‌న ప్రియుడితో పెళ్లి చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఓ వివాహిత సెల్‌ టవర్‌ ఎక్కి బెదిరించింది. ఈ విష‌యంపై స్థానికులు పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్క‌డికి వీఆర్వో, పోలీసులు చేరుకొని వివాహిత‌కు న‌చ్చ‌జెప్పారు. ఎట్ట‌కేల‌కు ఆమెను సెల్‌టవర్‌ నుంచి దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంత‌రం ఆ మ‌హిళ‌ను పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ఈ ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని కనమర్లపూడి గ్రామంలో ఈ రోజు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన ముట్లూరి లాజరు అనే వ్య‌క్తి కుటుంబ సభ్యులు జీవనోపాధి నిమిత్తం కర్నూలు జిల్లాకు వెళ్లి వస్తుంటారు. అక్క‌డ ఉంటున్న ముస్లిం వివాహిత అయిన‌ పఠాన్‌ షాహీనీతో లాజరుకు పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమె త‌న భ‌ర్త‌తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఆయ‌నతో వుండడం లేదు. దీంతో వీరు అక్క‌డే సహజీవనం కూడా చేశారు.

 కర్నూలు జిల్లాలో పనులు ముగియ‌డంతో లాజ‌రు త‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఆ వివాహితను త‌న‌తో గుంటూరుకి తీసుకొచ్చాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాలని లాజరుని ఆమె డిమాండ్ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకొని వస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని లాజరు ఆమెకు చెప్పాడు. దీంతో ఆ వివాహిత సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్ చేసింది.

  • Loading...

More Telugu News