: నేనో అమ్మాయిని, జూన్ 28న నా పెళ్లి.. దయచేసి ఈ పరీక్షల్లో నన్ను పాస్ చేయండి: విద్యార్థిని అభ్యర్థన
ప్రభుత్వాధికారులకు ఓ లేఖ రాసి తమకు పలు వసతులు కల్పించాలని, రోడ్లు బాగు చేయించాలని ప్రజలు అభ్యర్థన పెట్టుకోవడం సాధరణమే. తమ పని తొందరగా జరగాలన్నా, నిబంధనలకు విరుద్ధంగా తాము చేస్తోన్న పనికి అడ్డుపడకూడదన్నా అధికారులకి లంచం అనే ఆశ చూపి, తమ పనులు చేయించుకుంటారు కొందరు అక్రమార్కులు. అయితే, ఇదే పద్ధతి తాము ఎందుకు పాటించకూడదని ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అనుకుంటున్నారేమో? కష్టపడి చదువుకొని పాస్ కావాలని ఆలోచించకుండా, తమ పరీక్షల్లో జవాబు పత్రాల్లో యాబై, వంద రూపాయల నోట్లను పెట్టేసి, తమను పాస్ చేయాలని, ఆ పత్రాలు దిద్దే లెక్చలర్లని కోరుతున్నారు.
అయితే, ఓ అమ్మాయి ఇంకాస్త ముందుకు వెళ్లి తన పరీక్ష పత్రం చివరి పేజీలో తన బాధను చెప్పుకొని, తనను పాస్ చేయాలని కోరింది. ఆ అమ్మాయి రాసిన వాక్యం చూసి ఆశ్చర్యపోవడం పేపరు దిద్దే వాళ్ల వంతు అయింది. అందులో ఆమె ఏమని రాసిందంటే... ‘సర్.. నేను అమ్మాయిని, జూన్ 28న నా పెళ్లి.. దయచేసి ఈ పరీక్షల్లో నన్ను పాస్ చేయించండి. లేకపోతే నా కుటుంబం బాధపడుతుంది’ అంటూ అభ్యర్థన పెట్టుకుంది. ఇటువంటి వాటిపై అక్కడి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఇటువంటి పనులు చేస్తే లాభం ఉండబోదని, ఉపాధ్యాయులు ఇటువంటి పనులకు ఒప్పుకోరని స్పష్టం చేశారు.