: మిషెల్ కంటే ముందే మరో అమ్మాయితో ప్రేమలో పడ్డ ఒబామా!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే.1992లో మిషెల్ ను పెళ్లి చేసుకున్న ఒబామా, అంతకుముందు మరో అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని ఒబామా జీవిత కథ ఆధారంగా రాసిన ‘రైజింగ్ స్టార్: ది మేకింగ్ ఆఫ్ బరాక్ ఒబామా’ అనే పుస్తకంలో రచయిత డేవిడ్ జే గారో పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకంలో ఒబామా ప్రేమకథల గురించి తొలిసారిగా ప్రస్తావించడం గమనార్హం.
మిషెల్ కంటే ముందు షీలా మియోషి జాగర్ అనే మహిళతో ఒబామా ప్రేమలో పడ్డారని తెలిపారు. ఒబామాతో తన ప్రేమ వ్యవహారం గురించి షీలా చెప్పిన మాటలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ‘1986లో ఒబామా చికాగోలో ఉన్నప్పుడు మేము ప్రేమించుకున్నాం ఒబామా..మా తల్లిదండ్రులను కలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగారు. అప్పుడు, నా వయసు 23 సంవత్సరాలు.. ఒబామా వయసు 25. అయితే, మా తల్లిదండ్రులు మా పెళ్లికి అంగీకరించలేదు. అయినా... మా ప్రేమ వ్యవహారం అలానే కొనసాగింది...ఏడాది తర్వాత హార్వర్డ్ లా స్కూల్ కు ఒబామా వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లే ముందు కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారు. నేను అంగీకరిస్తే నన్ను కూడా హార్వర్డ్ కు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ, నేను ఒప్పుకోలేదు’ అని స్వయంగా షీలా చెప్పిన మాటలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. అయితే, ఒబామాను పెళ్లి చేసుకోలేకపోయాననే విషయం గుర్తుకువస్తే, ఇప్పటికీ తాను బాధపడుతుంటానని షీలా చెప్పడం గమనార్హం.