: పార్టీ ఉందని భర్తను తీసుకెళ్లింది... విషం పెట్టి చంపేసింది!
ఇష్టంలేని పెళ్లి చేశారంటూ అసహనంతో ఉన్న ఓ యువతి తన భర్తతో పదే పదే గొడవ పడుతూ ఉండేది. పెళ్లయిన కొన్ని రోజులకే తిరిగి పుట్టింటికి వచ్చేసింది. పెద్దల జోక్యంతో మళ్లీ భర్త దగ్గరకు వచ్చింది. తన భార్య తన వద్దకు మళ్లీ వచ్చేసిందని సంబరపడిపోయిన సదరు భర్తకు ఆ సంతోషం ఎన్నోరోజులు మిగల్లేదు. పెళ్లయిన మూడు నెలలకే తన భార్య చేతిలోనే తాను చనిపోతానని ఆయన ఊహించలేదు.
బర్త్ డే పార్టీకి వెళదామని చెప్పిన తన భార్య మాటలు నమ్మిన ఆ భర్త ఆమెతో కలిసి వెళ్లాడు. అయితే, ఓ పార్కుకు తన భర్తను తీసుకెళ్లిన ఆ యువతి ఆయనతో మాయమాటలు చెప్పి విషం మాత్రలు మింగించి, అనంతరం విషపు ఇంజెక్షన్ కూడా ఇచ్చింది. తర్వాత ఆయనను అక్కడే వదిలేసి, వెళ్లిపోయింది. అతను చనిపోతాడని భావించి, ఇంటికి వెళ్లిన ఆమె తన భర్త ఎటు వెళ్లాడో తెలియడం లేదని డ్రామా ఆడడం మొదలుపెట్టింది. అయితే, పార్కు నుంచి ఆమె భర్త అతి కష్టం మీద ఇంటికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. అయితే, ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయాడు.
ఈ దారుణ ఘటన బెంగుళూరు హాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తకు విషం ఇచ్చిన ఆ భార్య పేరు ఆశ (25) అని, ఆమె వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిందని, ఆమె చేతిలో చనిపోయిన భర్త పేరు విశ్వనాథ్ (28) అని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.