: రివర్స్ తలాక్.. ముస్లిం సమాజం ముందు భర్తకు తలాక్ చెబుతానని హెచ్చరించిన భార్య
ట్రిపుల్ తలాక్ వల్ల మన దేశంలో ఎంతో మంది ముస్లిం మహిళల జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఈ రకంగా మహిళల జీవితాలను నాశనం చేయడం మరింత ఎక్కువగా జరుగుతుంటుంటుంది. ట్రిపుల్ తలాక్ ను నిషేధించాలనే విషయంపై దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ముస్లిం సమాజంలో ప్రకంపనలు రేపుతోంది.
మీరట్ కు చెందిన అమ్రీన్ బానో (24) అనే మహిళ తన భర్త ఆగడాలను తట్టుకోలేక తన భర్తకు తలాక్ చెప్పేస్తానని హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్తే, 2012లో అమ్రీన్, ఫర్హీన్ అనే అక్కాచెల్లెళ్లు పొరుగు గ్రామంలోనే ఉన్న అన్నాతమ్ముళ్లు సాబిర్, షాకిల్ లను వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని రోజుల నుంచి వీరికి నరకం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ఓ చిన్న గొడవకే తన చెల్లి ఫర్హీన్ కు ఆమె భర్త మూడు సార్లు తలాక్ చెప్పేశాడు. దీంతో, ఆమెతో పాటే అమ్రీన్ కూడా భర్తను వదిలి తన తల్లిదండ్రులకు వద్దకు వచ్చేసింది. జరిగిన ఘటనపై వీరిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, తమ భర్తల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకునేందుకు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ నిన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో అమ్రీన్ నిప్పులు చెరిగింది. తన భర్త తనతో ఏమీ చెప్పలేదని... తన పిల్లల కోసం అతను డబ్బు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె... తన భర్తను జైలుకు పంపించాలని తాను కోరకుంటున్నానని చెప్పింది. ముస్లిం సమాజం ముందు తన భర్తకు తలాక్ చెప్పేస్తానని హెచ్చరించింది. ఈ విషయం మీడియా ద్వారా వెలుగు చూడటంతో.. సంచలనం రేకిత్తిస్తోంది. ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చను లేవదీసింది. వాస్తవానికి ముస్లిం మహిళలకు తలాక్ చెప్పే అధికారం ఉండదు.