: రేడియో జాకీ సంధ్య కేసులో భర్త అరెస్ట్
రెండు వారాల క్రితం సంచలనం కలిగించిన రేడియో జాకీ సంధ్య (28) ఆత్మహత్య కేసులో ఆమె భర్త, ఆర్మీ మేజర్ వైభవ్ విశాల్ (30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య మరణానంతరం అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆర్మీ 54 ఇన్ ఫ్యాంట్రీ డివిజన్ మేజర్ వైభవ్ ఆరోగ్యం కుదుటపడిందని సైనిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించగానే, ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వైభవ్ ను సైనికాధికారులే పోలీసులకు అప్పగించారని, ఆపై అరెస్టును చూపి విచారిస్తున్నామని తెలిపాయి.
కాగా, తమ ఇంట్లోనే సంధ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, భర్త వేధింపులు తాళలేకనే తమ కుమార్తె ఈ నిర్ణయం తీసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ జంట రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని ఆపై హైదరాబాద్ లో కాపురం పెట్టింది. సంద్య ఎఫ్ఎం చానల్ 'రేడియో చార్మినార్'లో జాకీగా పని చేస్తోంది. మరణించడానికి కొద్ది రోజుల ముందు నుంచి ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించేదని రేడియో చానల్ లో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కొందరు చెప్పినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.