: స్కూటీపై శునకం మూత్ర విసర్జన.. మాటామాటా పెరిగి తుపాకి కాల్పులు!
చిన్నవిషయాలకే తుపాకులు తీసే సంస్కృతి అమెరికాలో ఉంది... ఆ సంస్కృతి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా వెలుగు చూసింది. తాజాగా యూపీలోని బరేలి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన విస్మయం రేపుతోంది. బజరియా పట్టణంలోని అన్నపూర్ణాదేవి గుడికి పూరన్ లాల్ అనే వ్యక్తి వెళ్లాడు. దేవాలయం వెలుపల అతను తన స్కూటీని పార్క్ చేశాడు. దేవాలయం నుంచి వస్తున్న సమయంలో మున్నా యాదవ్ అనే వ్యక్తి కుక్క తన స్కూటీపై మూత్రం పోయడం గమనించి, కుక్క స్కూటీపై మూత్రం పోస్తుంటే.. దానిని దూరం తీసుకెళ్లాలన్న ఇంగితం లేదా? అంటూ ప్రశ్నించాడు.
దీంతో కుక్కే కదా... అంటూ మున్నా యాదవ్ తేలిగ్గా మాట్లాడాడు. దీంతో వాగ్వాదం పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన మున్నా యాదవ్, అతని కుమారుడు కలిసి తుపాకులు తీసి కాల్పులు ప్రారంభించారు. దీంతో ఈ కాల్పుల్లో పూరన్ లాల్, అతడి కొడుకులు విజయ్ కుమార్, ముకేష్ కుమార్ లతో పాటు రాంకిశోర్ శర్మ అనే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిని స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.