: సరైన సమయంలో ఫోటోలు విడుదల చేస్తాం...ముసుగు తీస్తాం: పన్నీరు సెల్వంకు దినకరన్ అనుచరుల హెచ్చరికలు


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఉన్న సమయంలో ఉన్న ఫోటోలు విడుదల చేసి, కొందరి ముసుగులు తొలగిస్తామని టీటీవీ దినకరన్ అనుచరులుగా పేరొందిన అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక కార్యదర్శి పుగళేంది తెలిపారు. పన్నీరు సెల్వం రాష్ట్ర పర్యటన ప్రారంభమైన నేపథ్యంలో మధురైలో బహిరంగ సభ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అపోలో ఆసుపత్రిలో అమ్మకు సరైన చికిత్స అందిందని అన్నారు. ఆసుపత్రిలో అమ్మకు చికిత్స అందిస్తున్న సందర్భంగా తీసిన చిత్రాలను తగిన సమయంలో బహిర్గతం చేస్తామని అన్నారు.

ఆ చిత్రాలు విడుదల చేసేందుకు అనుమతి కోసం నిరీక్షిస్తున్నామని అన్నారు. ఆ చిత్రాలు బయటకు వస్తే పలువురి ముసుగు తొలగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. దినకరన్‌ పై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఆయనను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జయలలితకు 33 సంవత్సరాల పాటు సన్నిహితురాలిగా, తల్లి స్థానంలో ఉన్న శశికళ త్యాగం చేశారని, ఆ విషయాన్ని మరిచిపోయేవారు అన్నాడీఎంకే కార్యకర్తలే కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News