: యువతిని కాపాడిన వ్యాపారుల్ని అనుమానించి... చుట్టుముట్టిన పలమనేరు యువకులు!


మంచికి పోతే చెడు ఎదురైందనే సామెతను రుజువు చేసే ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు గుడియాత్తం రోడ్డు క్రాస్‌ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రతిరోజూ కదులుతున్న కారులో అత్యాచారం, గ్యాంగ్ రేప్ అంటూ వస్తున్న వార్తలు... అక్కడి వారిని అప్రమత్తం చేసి, మంచి చేయబోయిన వారిపై దాడికి తెగబడేలా చేశాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు వైపు నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న ఇన్నోవా కారు పలమనేరు వద్ద ఆగింది. అందులో నుంచి ఆరుగురు యువకులు, ఓ యువతి దిగి టీ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ యువకులు టీ తాగి తిరిగి కారు వద్దకు వెళ్లే క్రమంలో వారి నుంచి ఆ యువతి పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ఆరుగురు యువకులు ఆమెను బలవంతంగా కారు ఎక్కించారు. దీనిని చూసిన యువకులు కారును చుట్టుముట్టారు. కారు కదలనీయలేదు. యువకులపై చేయి చేసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము దుండగులం కాదు మొర్రో అంటున్నా పట్టించుకోలేదు.

పోలీసులు రంగ ప్రవేశం చేసి, స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. ఈ సందర్భంగా వారు వెల్లడించిన విషయాలు చూసి విస్తుపోయారు. ప్రియాంక కండేల్‌ అనే ఆ యువతి చండీఘడ్ లో మంగళవారం డెహ్రడూన్ నుంచి మధురై వెళ్లే ఎక్స్‌ ప్రెస్‌ రైలులో ఒంటరిగా ఎక్కింది. ఈమె చండీఘ‌డ్ కు చెందిన ప్రీతిచంద్‌ కుమార్తె. ఇదే రైలులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌ లో మహ్మద్‌ జుబేల్‌, మహ్మద్‌ షావనార్‌, ఘయా జుద్దీన్ అనే ముగ్గురు వస్త్ర వ్యాపారులు ఎక్కారు. వీరు కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌ లో వస్త్ర వ్యాపారం చేసేవారు (ముళబాగల్‌ పలమనేరుకు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది).

 ప్రియాంక ప్రయాణిస్తున్న బోగీలోనే ఎక్కిన ఈ వస్త్ర వ్యాపారులు కొద్ది గంటల ప్రయాణం తరువాత ప్రియాంకను పలకరించి మాటలు కలిపారు. అనంతరం ఆమె వద్దనున్న ఆధార్‌ కార్డును చూసి ఆమెది ఛండీగఢ్ అని, ఆమె తండ్రి పేరు ప్రీతిచంద్‌ అని తెలుసుకున్నారు. మెల్లగా ఆమె నుంచి ఫోన్ నెంబర్ సేకరించి, ఆయనతో మాట్లాడారు. దీంతో ఆమె ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేసిందని, ఆమె మానసిక స్థితి సరిగాలేదని తెలుసుకున్నారు.

దీంతో తాము ముళబాగల్‌ కు వ్యాపారం నిమిత్తం వెళుతున్నామని ఆయనకు వివరించారు. దీంతో ప్రీతిచంద్‌ తాను బెంగుళూరు విమానాశ్రయానికి వస్తానని తన కుమార్తెను విమానాశ్రయం వద్ద అప్పగించాలని వారిని కోరారు. దీంతో ఆ యువకులు నాయుడుపేట రైల్వే స్టేషన్ లో బుధవారం తెల్లవారుజామున ప్రియాంకకు నచ్చజెప్పి దిగారు. ఆమెను వెంటబెట్టుకుని అక్కడే ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని...దానిలో బెంగుళూరు బయల్దేరారు.

ప్రయాణ బడలికను తీర్చుకునేందుకు పలమనేరులో టీ తాగేందుకు వాహనం నిలిపారు. టీ తాగి తిరిగి వాహనం ఎక్కే సమయంలో ఆ అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నించడంతో పట్టుకుని కారులో ఎక్కించారు. దీంతో ఆమెను ఏదో చేయడానికి తీసుకెళ్తున్నారని అనుమానించిన స్థానికులు...వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు, యువతి తండ్రి ప్రీతిచంద్ కు ఫోన్ చేసి, బెంగళూరు విమానాశ్రయం వద్ద వేచి చూస్తున్నారని తెలుసుకుని... వారిని పలమనేరు పోలీస్ స్టేషన్ కు రావాలని కోరారు. దీంతో వారు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అనంతరం పోలీసులు ప్రియాంకను వారికి అప్పగించారు. ఈ సందర్భంగా మానవత్వంతో యువతిని రక్షించిన వస్త్రవ్యాపారులను అంతా అభినందించారు.

  • Loading...

More Telugu News