: ఉత్తరకొరియాకు నీతులు చెబుతూ... క్షిపణి పరీక్ష నిర్వహించిన అమెరికా!
ఉత్తరకొరియా వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచానికి సవాలు విసురుతోందని చెబుతూ, నీతులు చెప్పిన అమెరికా మరోపక్క తన గురివింద గింజ నిజాన్ని ప్రదర్శిస్తోంది. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని నీతులు చెప్పే పెద్దన్న.. తాజాగా క్షిపణి పరీక్ష నిర్వహించి కలకలం రేపాడు. ఉత్తరకొరియాతో విభేదాల నేపథ్యంలో ఆ దేశ చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ తాము తల్చుకుంటే ప్రపంచంలో ఏ మూలపైనైనా అణుబాంబులు కురిపిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో అమెరికా మినిట్ మ్యాన్ అనే క్షిపణిని పరీక్షించింది.
ఈ మినిట్ మ్యాన్ క్షిపణి ప్రపంచంలోని ఏ మూలకైనా అణ్వాయుధాలను మోసుకెళ్లగలదని ఆ దేశ మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో ఎలాంటి ఆయుధాలు వాడకపోవడం విశేషం. కాలిఫోర్నియా నుంచి 4, 000 మైళ్ల దూరంలోని పసిఫిక్ మహాసముద్రంలోని ఓ ద్వీపంపై లక్ష్యాన్ని ఛేదించారు. ఈ సందర్భంగా అమెరికా ఆర్మీ అధికారులు మాట్లాడుతూ, ఆయుధాల సామర్థ్యం, కచ్చితత్వాన్ని పరీక్షిస్తున్నామని, ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఉత్తరకొరియా చర్యలతో ఆందోళనలో ఉన్న ప్రపంచాన్ని ఈ పరీక్ష మరింత ఆందోళనలోకి నెట్టింది.